అటు ఉగాది ఉషస్సు-ఇటు నిశీధి తమస్సు
వయ్యారాలు పోతూ-వగలొలుకబోస్తూ
రాజకుమారిలా వేంచేసి-
ఆంధ్ర భవన ద్వారాలు తెఱుస్తుంది వసంత లక్ష్మి!
దర్జాగా వస్తుంది ఉగాది ఓ క’వి కృతి’ గా!!
కృంగిన దేహంతో-కృశించిన ఆరోగ్యంతో
అయినవారే కొఱగాని వారై
అంధకార కారాగారంలో బంధీ-తెలంగాణ తల్లి!
ఎలావస్తుంది నిజమైన ఉగాది
ఎంతకూ ముగియదు కదా ఈ నిశీధి
వస్తుంది “విరోధి”కి తోడు మరో కాపలాదారు
ఒక ” వికృతి” గా !!
కోనసీమలు కొబ్బరాకులు
నూజివీడు రసాలు అరటి గెలలు
పంటపొలాల్లో పారే
కృష్ణా గోదావరి జలాలు!
పండిన ధాన్య రాశులు-నిండిన ధాన్యాగారాలు!!
అటు ఉగాది –అంతటా ప్రమోది
బీడు నేలలు -మోడు బ్రతుకులు
పాలమూరు కూలీలు-ఫ్లోరైడు బాధితులు
రైతు ఆత్మహత్యలు-తను నేసిన చీరతోనె నేతన్నల ఉరి చావులు
కనుకొలుకుల్లో సైతం అడుగంటిన నీరు
చుక్కనీరు లేకుండా అడుగుకో బోరు
ఎండిన చేనుల్లో ఎండ్రిన్ డబ్బాలు
మండిన గుండెల్లో ఉంటాయా పబ్బాలు
ఇటు ఉగాది- ఇంటింటా సమాధి
పంచ భక్ష్యాలతో ఆరగింపులు
అయిదు రుచులతో ఆకలికై వగ’చేదే’ లేని విందులు
బ్రతుకు పట్ల దిగులు లేని పంచాంగ శ్రవణాలు- కవి సమ్మేళనాలు
పచ్చదనం రాజ్యమేలుతుంటె పాడక ఛస్తుందా కోకిల మాత్రం!!
అటు ఉగాది-జన వినోది
గంజినీళ్ళు గట్కకూడు జొన్నలతో అంబలి రొట్టెలు
అయిదు రుచులు ఆంధ్ర సొంతమైతే
రుచుల మాట దేవుడెఱుగు ఆకలికై అర్రులు చాస్తూ
అరి’చేదంతా’ మన వంతైంది
మారని గ్రహచారాలు తొలగని పీడలు
ఏ పంచాంగాలు మార్చేను మన జాతకాలు?ఉంటే గింటే ఉద్యమ జాగృతాలు
ఎన్ కౌంటర్ల మిధ్య-బలిదానాల మధ్య
వినిపిస్తే గిస్తే రాబందుల గాత్రం!!
ఇటు ఉగాది-చితుల విబూది
అంతతనాలు-రాద్ధాంతాలు
పొమ్మని ఉమ్మేసినా తుడిపేసుకొనే రకాలు
మెడబట్టుక దొబ్బినా చూరుకు వేళ్లాడుతారు
మెజారిటీ తమదేనను అహంభావ విభవాలు
అందుకే అటు ఉగాది
చమత్కృతి భరిత ఓ క”వి’కృతి’”
ఆరని ఉద్యమాలు-ఆగనిపోరులు
ప్రాణాలు ఫణంపెట్టి తెలంగాణ రణాలు
కన్నతల్లి రొమ్ముదన్ను నీచులైన కీచకుల వెలి వేసి
ఎక్కిన కొమ్మను నరుక్కొనే నిజమైన మూర్ఖ రాజకీయుల వదిలేసి
నాల్గు కోట్ల ప్రాణాలు త్యజించైనా
అయిదు కోట్ల హృదయాలు హరించైనా
తొలగించాలి ఈ సుదీర్ఘ నిశీధి
అంతవరకు ఇటు ఉగాది
ఆత్మగౌరవ మృతి సహిత ఒక “వికృతి”