Sunday, August 4, 2013

రాఖీ||తెలంగాణ తల్లి - మన కల్పవల్లి||

తలకాయ ఎదులపురం (ఆదిలాబాద్)

మెడకాయ కరినగరం

చేతులు ఓరుగల్లు ఇందూరులు(వరంగల్.నిజామాబాద్)

ఛాతి మెతుకు (మెదక్)

కడుపు ఖమ్మం

ఉర:పంజరం రంగారెడ్డి

హృదయం భాగ్యనగరం (హైదరాబాద్)

కాళ్ళు నల్లగొండ పాలమూర్లు (మహబూబ్ నగర్)

ఇది తెలంగాణ తల్లి స్వరూపం

పదిజిల్లాల కల్పవల్లి సౌందర్యం!!

Thursday, October 27, 2011

ఆంధ్రులు ఆరంభ
శూరులు
ఋజువయ్యిందిగా
పలుమారులు!!

తెగిస్తేనే
తెలంగాణ
తెగేదాకా లాగితేనే
ఉంటుంది మనుగడ

ఇక “ఓదార్పు”
తెలంగాణా లో
జరిగింది మార్పు
జగనన్న పర్యటనలో...

వంతులవారీ
నకరాలు..
తెలంగాణ పోరుపేర
రాజకీయ నాటకాలు!

నాడైనాఎన్నడైనా
తెలంగాణ జనాలే
ఆంధ్రుల ముందు
బకరాలే!!

Saturday, April 2, 2011

స్నేహితులకు ,బ్లాగు మిత్రులకు -వీక్షకులకు, కవితాభిమానులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

ఈ“ఖర” ఆఖరా?!

ఈ“ఖర” ఆఖరా?!

కోయిలా కూయవేల? రాయిలా మౌనమేల?
ఉగాది రాలేదనా? రాదేలనా!
మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా
చింత కాయకుంటే ఎందుకంత చింత?
మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !
మమకారాలు కరువయ్యాయనా!
నీ పాట జనం మరి’చేద’య్యిందనా!
పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!
ఇది తెలంగాణాకు మరో దగాదనా
ప్రభుతకు దిగాదనా
వికీలీకులు- టుజీ స్కాంలు- నల్లధనాలు-కృష్ణ కమిటీ నయవంచనలు
పెట్రేగిన సెగాదనా
సునామీల అణుధారికతల అతలాకుతలమైన
జపనీయుల దుఃఖగాద మరి చేదనా
కాలాంతానికి ఈ “ఖర” ఆఖర నా


ఏ’దోనీ’ దయవల్లో సచినాడిన ప్రతిభ వల్లో
యువరాజు పటిమ వల్లో జహీర్ బంతి మెరుపులవల్లో
వీరలెవల్లో ఆడిన పరుగుల సెహవాగువల్లో ,
టీమిండియా పట్టుదలవల్లో శత ఏకవింశతి జనభారతి ప్రీతి వల్లో
సిక్సరుచుల తో,బౌండరీలతో ప్రపంచ టీములన్నిటినీ దంచి పచ్చడి చేసి
అందించిన ప్రపంచ క్రికెట్ ’కప్పు’ నీ ముందుంది.
అస్వాదించు ఆనందించు అది అందరికీ పంచు
అదే నీ మనోబలంపెంచు-విజయగానమిక వినిపించు

ఎందుకు నేస్తం?ఈ బేలతనం
పాడవే కోయిలా.. పాడుకో యిలా....
ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...
--రాఖీ---9849693324

Monday, March 15, 2010

తెలంగాణ ఉగాది శుభాకాంక్షలు!!

తెలంగాణ ప్రేమికులకు... అభిమానులకు...ప్రజలకు...కవులకు..కళాకారులకు..మేధావులకు..ప్రవాస తెలంగాణీయులకు..ప్రవాస ఆంద్రులకు..ప్రవాస భారతీయులకు..మేధావులకు అన్ని తెలంగాణ సాధన కార్యాచరణ సమితి లకు వికృతి ఉగాది శుభాకాంక్షలు!!

రాబోయే “ఖర”నామ ఉగాదిని ఖరారుగా ఖరాఖండిగా శ్రీకరముగా మన తెలంగాణా రాష్ట్రం లోనే జరుపుకోగలమని విశ్వసిస్తూ..దైవాన్ని ప్రార్థిస్తున్నాను

Sunday, March 14, 2010

అటు ఉగాది ఉషస్సు-ఇటు నిశీధి తమస్సు

అటు ఉగాది ఉషస్సు-ఇటు నిశీధి తమస్సు
వయ్యారాలు పోతూ-వగలొలుకబోస్తూ
రాజకుమారిలా వేంచేసి-
ఆంధ్ర భవన ద్వారాలు తెఱుస్తుంది వసంత లక్ష్మి!
దర్జాగా వస్తుంది ఉగాది ఓ క’వి కృతి’ గా!!

కృంగిన దేహంతో-కృశించిన ఆరోగ్యంతో
అయినవారే కొఱగాని వారై
అంధకార కారాగారంలో బంధీ-తెలంగాణ తల్లి!
ఎలావస్తుంది నిజమైన ఉగాది
ఎంతకూ ముగియదు కదా ఈ నిశీధి
వస్తుంది “విరోధి”కి తోడు మరో కాపలాదారు
ఒక ” వికృతి” గా !!
కోనసీమలు కొబ్బరాకులు
నూజివీడు రసాలు అరటి గెలలు
పంటపొలాల్లో పారే
కృష్ణా గోదావరి జలాలు!
పండిన ధాన్య రాశులు-నిండిన ధాన్యాగారాలు!!
అటు ఉగాది –అంతటా ప్రమోది

బీడు నేలలు -మోడు బ్రతుకులు
పాలమూరు కూలీలు-ఫ్లోరైడు బాధితులు
రైతు ఆత్మహత్యలు-తను నేసిన చీరతోనె నేతన్నల ఉరి చావులు
కనుకొలుకుల్లో సైతం అడుగంటిన నీరు
చుక్కనీరు లేకుండా అడుగుకో బోరు
ఎండిన చేనుల్లో ఎండ్రిన్ డబ్బాలు
మండిన గుండెల్లో ఉంటాయా పబ్బాలు
ఇటు ఉగాది- ఇంటింటా సమాధి

పంచ భక్ష్యాలతో ఆరగింపులు
అయిదు రుచులతో ఆకలికై వగ’చేదే’ లేని విందులు
బ్రతుకు పట్ల దిగులు లేని పంచాంగ శ్రవణాలు- కవి సమ్మేళనాలు
పచ్చదనం రాజ్యమేలుతుంటె పాడక ఛస్తుందా కోకిల మాత్రం!!
అటు ఉగాది-జన వినోది
గంజినీళ్ళు గట్కకూడు జొన్నలతో అంబలి రొట్టెలు
అయిదు రుచులు ఆంధ్ర సొంతమైతే
రుచుల మాట దేవుడెఱుగు ఆకలికై అర్రులు చాస్తూ
అరి’చేదంతా’ మన వంతైంది
మారని గ్రహచారాలు తొలగని పీడలు
ఏ పంచాంగాలు మార్చేను మన జాతకాలు?ఉంటే గింటే ఉద్యమ జాగృతాలు
ఎన్ కౌంటర్ల మిధ్య-బలిదానాల మధ్య
వినిపిస్తే గిస్తే రాబందుల గాత్రం!!
ఇటు ఉగాది-చితుల విబూది
అంతతనాలు-రాద్ధాంతాలు
పొమ్మని ఉమ్మేసినా తుడిపేసుకొనే రకాలు
మెడబట్టుక దొబ్బినా చూరుకు వేళ్లాడుతారు
మెజారిటీ తమదేనను అహంభావ విభవాలు
అందుకే అటు ఉగాది
చమత్కృతి భరిత ఓ క”వి’కృతి’”
ఆరని ఉద్యమాలు-ఆగనిపోరులు
ప్రాణాలు ఫణంపెట్టి తెలంగాణ రణాలు
కన్నతల్లి రొమ్ముదన్ను నీచులైన కీచకుల వెలి వేసి
ఎక్కిన కొమ్మను నరుక్కొనే నిజమైన మూర్ఖ రాజకీయుల వదిలేసి
నాల్గు కోట్ల ప్రాణాలు త్యజించైనా
అయిదు కోట్ల హృదయాలు హరించైనా
తొలగించాలి ఈ సుదీర్ఘ నిశీధి
అంతవరకు ఇటు ఉగాది
ఆత్మగౌరవ మృతి సహిత ఒక “వికృతి”

Tuesday, March 9, 2010

నా తెలంగాణ-రతనాల మౌనవీణ

తెల్లారి పోయింది తెలంగాణ భవితవ్యం
చల్లారిపోయింది ఎగసి పడిన ఉద్యమం
అమ్ముడై పోయినారు అతిరథులెందరో
కొమ్ముకాస్తున్నారు ప్రత్యర్థుల కెందరో
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ
1. తాతలు తాగిన నేతుల సంగతి
నెమరు వేయుటెనా మన సంస్కృతి
బలిదానంచేసిన నేతల సంస్మృతి
వల్లించడమేనా తెలంగాణ ప్రకృతి
బీరాలు పలికినారు ఆరంభ శూరుల్లా
బీరువులై పోయినారు చచ్చు పిరికి పందల్లా
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ

2. చదరంగపు పావులుగా విద్యార్థులు బలైనారు
వైకుంఠపాళి కేళి విషనాగుల చిక్కినారు
ఎలాపోల్చుదామన్నా తక్కువౌను ఉపమానం
రాజకీయాల్లొ లేవు సిగ్గు లజ్జ అభిమానం
తోకముడిచినారు ఏజాతికి చెందనోళ్లై
సొల్లుకార్చుకొన్నారు ఏ నీతికి అందనోళ్లై
ఎలా సంభవిస్తుంది నా తెలంగాణ
ఎప్పుడు నినదిస్తుందీ రతనాల వీణ