Saturday, February 20, 2010

తెలంగాణ సాధనే- సదా నీ ప్రధానమై

సాగిపో యేటి సంగీతమై
సాగిపో ఎదుగు సూర్య బింబమై
సాగిపో ఆశయాల అంబరాలు గమ్యమై
సాగిపో సాగిపో సాగిపో || సాగిపో||
1. అదురులేక బెదురులేక వడివడిగా సాగిపో
ఒడుదుడుకులు ఎదురైనా అధిగమించి సాగిపో
పంజరాలు బంధనాలు శృంఖలాలు త్రెంచుకొని
సాచిన రెక్కల స్వేఛ్ఛా విహంగ భంగి ఎగిరిపో || సాగిపో||

2. నిరాశా చీకట్లను ఛెండాడుతు సాగిపో
నిరోధాల మబ్బులనిక ఛేదించుక సాగిపో
గ్రహణాలు మరణాలు కారణాలు ఎదిరించి
అపరాహ్ణ గ్రీష్మకారు భానుడిలా రగిలిపో || సాగిపో||

3. భగీరథుడి మనోరథపు చెదరని సంకల్పమై
ఏకలవ్య హృదయాంతర నిశ్చల ఏకాగ్రతై
శ్రమఏవ జయమన్నది సదా నీ నినాదమై
తెలంగాణ సాధనే- సదా నీ ప్రధానమై || సాగిపో||

Saturday, February 13, 2010

గీతోపదేశం-శ్రీకృష్ణ సందేశం

గీతోపదేశం-శ్రీకృష్ణ సందేశం
పోరునాప మనలేదు-వెన్నుచూప మనలేదు
సాగించు వీరుడా కడదాకా రణం
తెలంగాణ సాధన-దా-కా-రణం
జై తెలంగాణ! జైజై తెలంగాణా!!
1. తన పర ఎవరనేది ఎంచకు
యుద్ధంలో అడ్డొస్తే మన్నించకు
యాచించుటకిది కాదు ఒకరు వేయు భిక్షం
ప్రాణాలు ఫణం పెట్టి సాధించు నీ లక్ష్యం
2. మన పరిధిలొ ఉండదు ఏ ఫలితం
నిర్వహించు అనుక్షణం నీ కర్తవ్యం
పూరించు బిగబట్టి సమర శంఖం
ప్రత్యర్థుల గుండెల్లో సడలాలి బింకం
3. కుట్రలు కుతంత్రాలు సాధారణం
మాయోపాయాల వ్యూహాలే కదా రణం
యోధుడికిల ఎప్పుడూ ఉండబోదు మరణం
కోట్లమంది త్యాగమే మనకిక శరణం
తెలంగాణ రాష్ట్రమే విజయ తార్కాణం

Thursday, February 4, 2010

రాజీనామా చేయండి చపల చిత్తులారా!

మా నెత్తుటి చుక్కలనే విత్తనాలు పాతండి
మొలకెత్తే తెలంగాణ చెట్టు పళ్ల కెగబడండి
రాజకీయ పక్షాల నేతలారా
నరమాంస భక్షకుల దూతలారా
మా శవాలపై పేలాలేరుకొని తినగరండి
మీ పదవీ లాలసలో మనుషులనీ మరచిపొండి

1. పదవీ అధికారం ఇచ్చింది ఈ ప్రజలేగా
ఓటేసి ఎన్నుకుంది తెలంగాణ జనమేగా
ప్రజాభీష్టమే మీరు కాలరాస్తే
తాత్కాలిక హంగులకై ప్రాకులాడితే
ఇచ్చిన అధికారం తిరిగి తీసుకోనుగలరు
ఎక్కించిన మీ గద్దెను ఎలాగైన దించగలరు
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా
2. రంగుల జండాలిక పక్కన బెట్టండి
తెలంగాణ సాధనకై తెగువ చూపి కదలండి
విద్యార్థుల పోరుబాట విధిగా ఇక సాగండి
ఉద్యమాన యువతతో చేయిచేయి కలపండి
తెలంగాణ గడ్డమీద నిజంగా పుట్టారా
అమ్మానాన్నలకైన తలకొరివి పెట్టేరా
కళ్ళిక తెఱవండి కపట నాయకులారా
రాజీనామా చేయండి చపల చిత్తులారా

Tuesday, February 2, 2010

పాదాక్రాంతం నీకు జయం

నేర్పుతుంది జీవితమే
అనుక్షణం కొత్త పాఠమే
ఓడిపోతుంది ఒకనాడు ఓటమే
ఓర్పుతో సాధిస్తే వరించేను విజయమే
1. అద్భుతాలు జరిగి ఎవ్వరూ- కాలేదు గొప్పవారు
అదృష్టం నమ్ముకొని అవలేదు-మహానీయులు
ఇటుక మీద ఇటుక పేర్చి -కడితేనే మేడగ మారు
పునాదియే పటిష్టమైతే –కట్టడాలు కడతేఱు
2. నిద్రలేమి రాత్రులెన్నో- గడిపారు కీర్తి చంద్రులు
సాధనయే ఊపిరిగా- సాగారు లక్ష్య పథికులు
పక్కదోవ పట్టలేదు –ఎన్నడైనా విజేతలు
ధ్యేయాన్ని మరువలేదు –కలనైనా జిష్ణువులు
3. భగీరథుని సంకల్పం-అవ్వాలీ నీకభిమతం
సడలని విక్రమార్కుని-పట్టుదలే నీకాదర్శం
ఏకలవ్యు నేకాగ్రతయే- ఎప్పటికీ నీకు హితం
అభిమన్యుని విక్రమతే-సదా నీకు ప్రామాణ్యం
4. ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం