నేలకొరిగిన వీరులారా!వందనం వందనం
తలలు తెగిన తమ్ములారా అందుకోండి మా సలాం
తెలంగాణా బిడ్డలారా! మీకు అశ్రుల తర్పణం
తెలంగాణా సాధించగ మేము సైతం అర్పణం
1.మీరు నడిచిన పోరు బాట వదలబోమయ్యా
మీరు చేసిన ఆత్మత్యాగం మరువ బోమయ్యా
తెలంగాణా తల్లికోసం వేల జన్మలు కోరుతాం
తెలంగాణా స్వేఛ్ఛకోసం కోట్లమందిమి పోరుతాం
అస్తమించిన అమరులారా! జోహార్ జోహార్
స్వర్గమేగిన యోధులారా అందుకోండి దిల్ సె ప్యార్
2.నూరేళ్ళ జీవితాలు తృణప్రాయం చేసినారు
ముక్కుపచ్చలారకుండగ మృత్యువొడిలో చేరినారు
కరుడుగట్టిన గుండె కూడ కరిగిపోతుంది
మీరు చేసిన ఆత్మబలికి విలువ వస్తుంది
మా కంటివెలుగై కదలినారు కదన రంగంలో
ఇంటింటి దివ్వెగ నిలువగలరు తెలంగాణా చరితలో
వధ్యశిలలపై వంచినాము తలలు- ఉరికొయ్యలకే తగిలించినాము మెడలు
కాలిబూడిదవుటకేన మా ఒడలు- ఎప్పటికిక కరుగుతాయి మీ యెదలు
అడ్డుతగలకండి సైంధవులారా!- అంతతనం చేయకండి ఆంధ్రులారా! సీమాంధ్రులారా!!
1.దేవుడు వరమిచ్చినా పెంచుతారు అంతరాలు- దేవత కరుణించినా కల్పించుతా రవాంతరాలు
నోటుముందటి మాకూటిని ఎత్తగొట్టుతారు- ఇంకాఏమ్మిగిలిందని ఇల్లు కొల్లగొట్టుతారు
దారి వదలిపెట్టండి దాయాదులారా- తలకొరివిగ మారకండి ఆంధ్రసోదరులార
2.కన్నతల్లుల కడుపుకోత కార్చిచ్చై కాల్చుతుంది- దీనార్తుల గుండె కోత తరతరాలు కూల్చుతుంది
తెలంగాణ యువతరక్తం ఉప్పెనై ముంచెత్తుతుంది- విద్యార్థుల ఆక్రోశం ఉరుమై మిన్నంటుతుంది
తెలంగాణ తథ్యమన్నది సత్యమే అయితే- తాత్సారం చేయ తగదు న్యాయమే ఇది అయితే
3.ఎంతమంది కావాలో తెలంగాణాకోరి బలి- ఎప్పటికిక తీరుతుందో (సోనియా ఆకలి) ఆగని ఈ ఘోరకలి
నరమేధం సాగుతోంది నాన్చే ధోరణిలో- అసంఖ్యాక శిరఛ్ఛేద చింతామణిలో
ప్ర్రాణాలతో బేరమాడినా ఫరవాలేదు- నాల్గుకోట్ల తెలంగాణ వెఱవబోదు
4.శ్రీకాంతులెంత మంది తగుల బడి పోవాలో- వేణుసువర్ణలెందరు మంటలపాలవ్వాలో
అమరవీరులారా ఆగదు మన సమరం- మీ బలిదానాలు వృధాకాని పోరాటం
తెలంగాణ ఒక్కటే మన లక్ష్యం- మీ ఆత్మల సాక్షిగా వెలుస్తుంది మన రాష్ట్రం
మన తెలంగాణ రాష్ట్రం జైతెలంగాణా! జై జై తెలంగాణా!!
Tuesday, January 19, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment