Tuesday, February 2, 2010

పాదాక్రాంతం నీకు జయం

నేర్పుతుంది జీవితమే
అనుక్షణం కొత్త పాఠమే
ఓడిపోతుంది ఒకనాడు ఓటమే
ఓర్పుతో సాధిస్తే వరించేను విజయమే
1. అద్భుతాలు జరిగి ఎవ్వరూ- కాలేదు గొప్పవారు
అదృష్టం నమ్ముకొని అవలేదు-మహానీయులు
ఇటుక మీద ఇటుక పేర్చి -కడితేనే మేడగ మారు
పునాదియే పటిష్టమైతే –కట్టడాలు కడతేఱు
2. నిద్రలేమి రాత్రులెన్నో- గడిపారు కీర్తి చంద్రులు
సాధనయే ఊపిరిగా- సాగారు లక్ష్య పథికులు
పక్కదోవ పట్టలేదు –ఎన్నడైనా విజేతలు
ధ్యేయాన్ని మరువలేదు –కలనైనా జిష్ణువులు
3. భగీరథుని సంకల్పం-అవ్వాలీ నీకభిమతం
సడలని విక్రమార్కుని-పట్టుదలే నీకాదర్శం
ఏకలవ్యు నేకాగ్రతయే- ఎప్పటికీ నీకు హితం
అభిమన్యుని విక్రమతే-సదా నీకు ప్రామాణ్యం
4. ఆత్మహత్య ఎలాచూసినా-అవమానం అతిహేయం
కన్నవారి గుండెకోత- అసమానం దయనీయం
సంపూర్ణ ఆయుర్దాయం-సర్వులకిల అనుభవనీయం
ప్రయత్నిస్తె ఎన్నటికైనా-పాదాక్రాంతం నీకు జయం

No comments:

Post a Comment